Mamidikaya Kobbari Pachadi : మనం పచ్చి మామిడికాయను నేరుగా తినడంతో పాటు దీనితో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పచ్చి మామిడికాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మామిడికాయలతో మనం చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మామిడికాయ కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. మామిడికాయలు, పచ్చి కొబ్బరి కలిపి చేసే ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన పుల్లటి మామిడికాయ ముక్కలు – అర కప్పు, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 8, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, ఉప్పు – తగినంత,, పచ్చి కొబ్బరి ముక్కలు – ఒకటింపావు కప్పు, కొత్తిమీర – ఒక చిన్న కట్ట.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – 2 చిటికెలు, సన్నని అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్.
మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి వీటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే కొబ్బరి ముక్కలు, కొత్తిమీర కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా మామిడికాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.