Masala Egg Macaroni : మ‌సాలా ఎగ్ మాక్రోనీ.. టేస్ట్ అదుర్స్‌.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Masala Egg Macaroni : మాక్రోని.. దీనిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మాక్రోనితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేయ‌వ‌చ్చు. మాక్రోనితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌సాలా ఎగ్ మాక్రోని కూడా ఒక‌టి. దీనిని కేవ‌లం 20 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ఎగ్ మాక్రోనిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా ఎగ్ మాక్రోని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మాక్రోని – ముప్పావు క‌ప్పు, నూనె – 5 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 2, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, వెల్లుల్లి త‌రుగు – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – 1, నీళ్లు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర -కొద్దిగా, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Masala Egg Macaroni recipe in telugu make in this method
Masala Egg Macaroni

మ‌సాలా ఎగ్ మాక్రోని త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక మాక్రోనిని వేసి మెత్త‌గా ఉడికించాలి. తరువాత వీటిని వ‌డ‌క‌ట్టి గిన్నెలోకి తీసుకుని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత క‌ళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత కోడిగుడ్ల‌ను ఆమ్లెట్ లా వేసుకోవాలి. దీనిపై చిటికెడు కారం, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి 50 శాతం ఉడికించాలి. త‌రువాత వీటిని పెద్ద పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకుని వేయించాలి. కోడిగుడ్లు చ‌క్క‌గా వేగిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి త‌రుగు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత గ‌రం మసాలా, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌గ్గించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత నీళ్లు పోసి ఉడికించాలి. వీటిని 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత ఉడికించిన మాక్రోని వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన కోడిగుడ్డు వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం చ‌ల్లుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ఎగ్ మాక్రోని త‌యార‌వుతుంది. దీనిని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా దీనిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts