Veg Schezwan Fried Rice : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో, రెస్టారెంట్ లలో లభించే పదార్థాల్లో ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఫ్రైడ్ రైస్ ను ఇష్టంగా తింటారు. అలాగే మనకు వివిధ రుచుల్లో ఈ ఫ్రైడ్ రైస్ లభిస్తుంది. మనకు ఎక్కువగా లభించే ఫ్రైడ్ రైస్ వెరైటీలలో వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. షేజ్వాన్ సాస్ వేసి చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా ఈ ఫ్రైడ్ రైస్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, ఎండుమిర్చి – 4, క్యారెట్ తరుగు – పావు కప్పు, బీన్స్ తరుగు – పావు కప్పు, షేజ్వాన్ సాస్ – పావు కప్పు, ఉప్పు – తగినంత, అరోమేటిక్ పౌడర్ – ముప్పావు టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్, అనాస పువ్వు పొడి – ముప్పావు టీ స్పూన్, అన్నం – ఒక కప్పు బాస్మతీ బియ్యంతో ఉడికించినంత, లైట్ సోయాసాస్ – అర టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, పంచదార – 2 చిటికెలు, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు వేసి వేయించాలి. తరువాత షేజ్వాన్ సాస్ వేసి కలుపుతూ వేయించాలి. తరువాత ఉప్పు, అరోమేటిక్ పౌడర్, తెల్ల మిరియాల పొడి, అనాసపువ్వు పొడి వేసి కలపాలి. వీటిని నూనెలో బాగా వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని పెద్ద మంటపై టాస్ చేసుకోవాలి. తరువాత లైట్ సోయాసాస్, వెనిగర్ వేసి టాస్ చేయాలి. ఇక దించే ముందు పంచదార, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. తరచూ చేసే ఫ్రైడ్ రైస్ తో పాటు అప్పుడప్పుడూ ఇలా షేజ్వాన్ సాస్ వేసి కూడా ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. మన కారానికి తగినట్టు ఈ సాస్ ను వేసుకోవాల్సి ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.