Meal Maker Beerakaya Curry : మనం మీల్ మేకర్ లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్ లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మీల్ మేకర్ బీరకాయ కూర కూడా ఒకటి. మీల్ మేకర్, బీరకాయ కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మీల్ మేకర్ లతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో సులభంగా చేసుకోదగిన ఈ బీరకాయ మీల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ బీరకాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీరకాయలు – అరకిలో, తరిగిన ఉల్లిపాయలు – 2, మీల్ మేకర్ – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు -తగినంత, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా -ఒక టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్.
మీల్ మేకర్ బీరకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లను వేడి నీటిలో నానబెట్టాలి. తరువాత నీటిని పిండేసి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని ఒకనిమిషం పాటు వేయించిన తరువాత మీల్ మేకర్ ను వేసి కలపాలి.
వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత బీరకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. వీటిని మరో 10 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ బీరకాయ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల మనం బీరకాయలు మరియు మీల్ మేకర్ లలో ఉండే పోషకాలను పొందవచ్చు.