Meal Maker Fried Rice : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే ఆహార పదార్థాల్లో మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. మీల్ మేకర్ లతో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ ఫ్రైడ్ రైస్ ను బయట లభించే రుచి వచ్చేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. మీల్ మేకర్ లతో రుచిగా, అందరూ ఇష్టపడేలా ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక గ్లాస్ బాస్మతీ బియ్యంతో వండినంత, నూనె- 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లి సాస్ – ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి- అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
మీల్ మేకర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద పరిమాణంలో ఉండే సోయా చంక్స్ – అర కప్పు, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల వేడి నీటిని తీసుకోవాలి. తరువాత అందులో సోయా చంక్స్ ను వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత సోయా చంక్స్ ను తీసి చల్లటి నీటిలో వేయాలి. తరువాత వీటిలో ఉండే నీరంతా పోయేలా గట్టిగా పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప ఫ్రైకు కావల్సిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత పిండి మీలల్ మేకర్ లకు పట్టేలా తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న సోయా చంక్స్ ను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి పెద్ద మంటపై పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి.
తరువాత క్యాప్సికం ముక్కలు వేసి కలుపుతూ వేయించాలి. తరువాత వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, రెండు టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత వేయించిన చంక్స్ వేసి కలపాలి. ఇప్పుడు అన్నాన్ని వేసి అంతా కలిసేలా కలపాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో లేదా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా మీల్ మేకర్ తో ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.