Menthikura Ullikaram Iguru : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూరలో అనేక ప్రయోజనాలు,పోషకాలు దాగి ఉన్నాయి. మెంతికూరను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెంతికూరతో కూడా మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మెంతికూర ఉల్లికారం ఇగురు కూడా ఒకటి. ఈ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. మెంతికూరను ఇష్టపడని వారు కూడా ఈ విధంగా తయారు చేసిన ఇగురును ఇష్టంగా తింటారు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే మెంతికూరతో మెంతికూర ఉల్లికారం ఇగురును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర ఉల్లికారం ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతికూర కట్టలు – 4, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 10, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 8, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన టమాటాలు – 3, పసుపు – పావు టీ స్పూన్.
మెంతికూర ఉల్లికారం ఇగురు తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మెంతికూర వేసి వేయించాలి. మెంతికూర పూర్తిగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం, పసుపు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. టమాట ముక్కలు పూర్తిగా వేగి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.