Methi Puri : మెంతులతో మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో.. మెంతి ఆకులతోనూ మనకు అదేవిధంగా లాభాలు కలుగుతాయి. వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. కానీ మెంతి ఆకులు మనకు ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని నేరుగా తినలేని వారు పలు ఇతర విధాలుగా కూడా తినవచ్చు. ముఖ్యంగా మెంతి ఆకులతో చేసే పూరీలు చాలా మందికి నచ్చుతాయి. వీటిని ఎంతో రుచికరంగా తయారు చేసుకుని తినవచ్చు. ఈ క్రమంలోనే మెంతి ఆకులతో పూరీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి ఆకుల పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతి ఆకులు, గోధుమ పిండి – ఒక కప్పు చొప్పున, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, పసుపు – చిటికెడు, కారం, వెల్లుల్లి తురుము, పెరుగు – రెండు పెద్ద టీస్పూన్స్ చొప్పున, ఉప్పు – తగినంత, పచ్చి మిర్చి – 4 (సన్నగా తరగాలి), అల్లం తురుము – పెద్ద టీస్పూన్, నెయ్యి – తగినంత, కసూరీ మేథీ – కొద్దిగా, ధనియాల పొడి – టీస్పూన్, గరం మసాలా – పెద్ద టీస్పూన్.
మెంతి ఆకుల పూరీ తయారీ విధానం..
ఒక గిన్నెలో గోధుమ పిండి, మెంతి ఆకులు.. ఇలా అన్ని పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి వేసుకుంటూ చివరగా పెరుగు వేసి చపాతీ పిండిలా కలపాలి. అవసరం అయితే కొన్ని నీళ్లను కూడా కలవపచ్చు. ఈ పిండిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తరువాత పూరీల్లా చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె పోయాలి. అది కాగిన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూరీలను వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే.. నోరూరించే మెంతి ఆకుల పూరీలు తినడానికి రెడీ అవుతాయి. వీటిని పప్పు లేదా ఆలు టమాటా కూరతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.