Milk Chocolate Burfi : మిల్క్ చాక్లెట్ బర్ఫీ.. పాలతో తయారు చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా స్వీట్ షాపుల్లో ఈ బర్ఫీ లభిస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బర్ఫీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పండగలకు ఇలా ఇంట్లోనే స్వీట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మిల్క్ చాక్లెట్ బర్ఫీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ చాక్లెట్ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, పంచదార – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, కోకో పౌడర్ – ఒక టీ స్పూన్.
మిల్క్ చాక్లెట్ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిని తీసుకోవాలి. తరువాత దీనిని నీటితో కడిగి స్టవ్ మీద ఉంచాలి. తరువాత ఇందులో పాలు పోసి కలుపుతూ వేడి చేయాలి. పాలపై ఉండే మీగడను పాలల్లో కలుపుతూ దగ్గర పడే వరకు మరిగించాలి. ఇలా అరగంట పాటు మరిగించిన తరువాత ఇందులో యాలకుల పొడి, పంచదార, నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో పది నుండి 15 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. పాలు చిక్కబడి కోవాలా తయారైన తరువాత కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చుట్టి చూడాలి. ఈ మిశ్రమం ఉండలా చుట్టడానికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కోవా నుండి సగం కోవాను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన కోవాలో కోకో పౌడర్ వేసి కలపాలి.
ఇప్పుడు ఈ రెండు కోవా మిశ్రమాలను చేత్తో వత్తుతూ మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ ను లేదా చెక్కను తీసుకునిదానిపై ముందుగా తెల్లగా ఉండే కోవాను తీసుకుని చపాతీ కర్రతో వత్తుతూ చతురస్రాకారంలో చేసుకోవాలి. తరువాత దానిపై కోకో పౌడర్ వేసిన కోవాను వేసి మరలా చతురస్రాకారం వచ్చేలా వత్తుకోవాలి. రెండింటిని సమానంగా చేసుకున్న తరువాత మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిల్క్ చాక్లెట్ బర్ఫీ తయారవుతుంది. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా చాక్లెట్ బర్ఫీని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.