Minapattu : మినపప్పుతో మనం రకరకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాము. మినపప్పుతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాల్లో మినపట్టు కూడా ఒకటి. మినపట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేరకం అల్పాహారాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. మినపట్టును తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా ఈ మినపట్టును తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మినపట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినపట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
3 గంటల పాటు నానబెట్టిన మినపప్పు – ఒక కప్పు, బియ్యంపిండి – 5 టీ స్పూన్స్, పంచదార – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
మినపట్టు తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తరువాత పప్పును జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇదే జార్ లో బియ్యంపిండి, పంచదార, మరికొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి కలపాలి. పిండి మరీ పలుచగాఉండకుండా చూసుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. ఈ అట్టు మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. తరువాత దీనిపై ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు చల్లుకోవాలి. తరువాత నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకోవాలి. అట్టు ఒకవైపు కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినపట్టు తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఏ చట్నీతో తిన్నా కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది.