Mini Aloo Samosa : మనకు సాయంత్రం సమయాల్లో టీ షాపుల్లో, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మనకు సమోసాలతో పాటు మినీ సమోసాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇవి సమోసాలే కానీ చూడడానికి చిన్నగా ఉంటాయి అంతే. ఈ మినీ సమోసాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే సులభంగా మినీ సమోసాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మినీ ఆలూ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – రెండు కప్పులు, కళోంజి విత్తనాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, వాము – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 6, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి -ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మినీ ఆలూ సమోసా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలపాలి. తరువాత మెత్తగా చేసుకున్న బంగాళాదుంపలు వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత పిండిని తీసుకుని మరోసారి కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. తరువాత దీనిని మధ్యలోకి కట్ చేసుకుని అంచులకు తడి చేసుకోవాలి. తరువాత దీనిని సమోసాలా మడుచుకుని అందులో బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత అంచుకుని వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సమోసాలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినీ సమోసాలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.