Mixed Veg Oats Kichdi : మిక్స్‌డ్ వెజ్ ఓట్స్ కిచిడీ.. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్‌..!

Mixed Veg Oats Kichdi : ఓట్స్.. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఇవి కూడా ఒక‌టి. ఓట్స్ లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఓట్స్ మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఓట్స్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఓట్స్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఓట్స్ కిచిడీ కూడా ఒక‌టి. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఈ ఓట్స్ కిచిడీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారని చెప్ప‌వ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ కిచిడిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చిటికెలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ కిచిడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్ కిచిడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు -ఒక టీ స్పూన్, జీల‌కర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా తరిగిన క్యారెట్ ముక్క‌లు – 3టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన బీన్స్ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, బ‌ఠాణీలు – అర క‌ప్పు, త‌రిగిన ట‌మాట – 1, మొల‌కెత్తిన గింజ‌లు – అర క‌ప్పు, ఓట్స్ – ఒక క‌ప్పు, నీళ్లు – రెండున్న‌ర క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Mixed Veg Oats Kichdi recipe in telugu very healthy breakfast
Mixed Veg Oats Kichdi

ఓట్స్ కిచిడీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనెలో వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి మెత్త‌బ‌డిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత కూర‌గాయ‌ల ముక్క‌లన్నీ వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత మొల‌కెత్తిన గింజ‌లు వేసి క‌ల‌పాలి. ఈ గింజ‌లు 70 శాతం వేగిన త‌రువాత ఓట్స్ వేసి క‌ల‌పాలి. ఓట్స్ వేగిన త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మొల‌కెత్తిన గింజ‌లు మెత్త‌గా అయ్యే వర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌, నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ కిచిడీ త‌యార‌వుతుంది. ఈ కిచిడీని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

D

Recent Posts