Mixed Vegetable Pachadi : మనం దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి.. ఇలా కూరగాయలతో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కూరగాయలతో చేసే పచ్చళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ఇలా ఒక్కో కూరగాయతో ఒక్కో పచ్చడి కాకుండా వీటన్నింటిని కలిపి కూడా మనం రుచికరమైన పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కూరగాయలన్నింటిని కలిపి చేసే ఈ వెజిటేబుల్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ వెజిటేబుల్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బెండకాయలు – 5, తరిగిన బీరకాయ – సగం ముక్క, తరిగిన దొండకాయలు – 5, తరిగిన వంకాయలు – 2, తరిగిన టమాటాలు – 3, నూనె -ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, మెంతులు – చిటికెడు, పచ్చిమిర్చి – 15 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ – 1.
వెజిటేబుల్ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో టమాటాలు తప్ప మిగిలిన కూరగాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, టమాటాలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని చల్లారే వరకు పక్కకు ఉంచాలి.
ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన పచ్చిమిర్చిని, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పచ్చడి తయారవుతుంది. ఇందులో మనకు నచ్చిన ఇతర కూరగాయలను కూడా వేసుకోవచ్చు. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోశ, ఉతప్పం వంటి అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తినవచ్చు.