Moong Dal Khichdi : మనం ఎక్కువగా చేసే రైస్ వెరైటీలలో పెసరపప్పు కిచిడీ కూడా ఒకటి. పెసరపప్పుతో చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు లేకుండా చేసే ఈ కిచిడీని తినడం వల్ల పొట్టకు కూడా హాయిగా ఉంటుంది. పిల్లలకు కూడా దీనిని ఆహారంగా ఇవ్వవచ్చు. ఈ పెసరపప్పు కిచిడీని ఎవరైనా చాలా సులభంగా చేసుకోవచ్చు. రుచి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పెసరపప్పు కిచిడీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు కిచిడీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కడిగిన బియ్యం – ఒక గ్లాస్, కడిగిన పెసరపప్పు – అర కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన టమాట – 1, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, బిర్యానీ ఆకు – 1, ఉప్పు- తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు- కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్.
పెసరపప్పు కిచిడీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత క్యారెట్, బంగాళాదుంప, టమాట ముక్కలు వేసి వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత బియ్యం, పెసరపప్పు వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించిన తరువాత మూడు గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కిచిడీ తయారవుతుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ కిచిడీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.