Munagaku Pappu : మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో, ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో ఇలా అనేక రకాలుగా మునగాకు మనకు సహాయపడుతుంది. ఈ మునగాకుతో మనం కారం పొడి, పప్పు వంటి వాటిని తయారు చేసుకుని ఆహారంగా తీసుకోవచ్చు. మునగాకు పప్పు చాలా రుచిగా ఉంటుంది. వగరు, చేదు, వాసన లేకుండా ఈ పప్పును మనం రుచిగా తయారు చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని అందించే మునగాకుతో పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కడిగిన కందిపప్పు – ఒక కప్పు, నూనె – 2 టీ స్పూన్స్, లేత మునగాకు – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 6, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు- తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు -ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – అర టీ స్పూన్.
మునగాకు పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మునగాకు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉప్పు, పసుపు, టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కందిపప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూతతీసి ఇందులో చింతపండు రసం వేసి కలపాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా ఉడికించిన పప్పును వేసి కలపాలి. ఈ పప్పును మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునగాకు పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మునగాకుతో రుచిగా పప్పును తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.