Munagaku Karam Podi : మన ఆరోగ్యానికి మునగాకు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మునగాకు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా మనకు మునగాకు సహాయపడుతుంది. ఈ మునగాకును వంటల్లో వాడడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే మునగాకు కారం పొడిని తయారు చేసుకోవచ్చు. మునగాకుతో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని, మొదటి సారి చేసేవారు ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మునగాకుతో రుచిగా,సులభంగా కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగాకు – 5 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిరపకాయలు – 20 లేదా కారానికి తగిన్ని, శనగపప్పు – అర కప్పు, మినపప్పు – అర కప్పు, ధనియాలు – ఒక కప్పు, జీలకర్ర – పావు కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్, వెల్లుల్లి పాయ – 1, చింతపండు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత.
మునగాకు కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొంత నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి సగం వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత ఇంగువ వేసి కలపాలి. తరువాత వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మునగాకు వేసి వేయించాలి. మునగాకు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో వేయించిన ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఇందులోనే వేయించిన దినుసులు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన మునగాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునగాకు కారం పొడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మునగాకుతో ఈ విధంగా కారం పొడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. దీనిని పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఆహారంలో భాగంగా ఇవ్వవచ్చు.