Munakkaya Nilva Pachadi : మునక్కాయలు.. ఇవి మనందరికీ తెలుసు. వీటిని ఆహారంలో భాగంగా మనం తరచూ తీసుకుంటూ ఉంటాం. మునక్కాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మునక్కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మునక్కాయలతో ఎంతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కండ ఎక్కువగా ఉన్న లేత మునక్కాయలు – 2, నానబెట్టిన చింతపండు – 50గ్రా., ఆవాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండు మిరపకాయలు – 4, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్ లేదా తగినంత, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత.
మునక్కాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా మునక్కాయలను శుభ్రంగా కడిగి 2 ఇంచుల పొడువులో ముక్కలుగా చేసి తడి లేకుండా ఆరబెట్టాలి. అలాగే నానబెట్టిన చింతపండు నుండి గుజ్జును తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలను, మెంతులను వేసి చిన్న మంటపై రంగు మారే వరకు వేయించి చల్లగా అయ్యే వరకు పక్కకు ఉంచాలి. తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత మునక్కాయ ముక్కలను వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
అదే నూనెలో శనగ పప్పును, మినప పప్పును, ఆవాలను, జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలను, ఎండు మిరపకాయలను, కరివేపాకును వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, ఇంగువ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత చింతపండు గుజ్జును వేసి కలిపి చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా పెద్దగా ఉండే గిన్నెను తీసుకుని అందులో కారాన్ని, ఉప్పును, ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తరువాత వేయించిన మునక్కాయ ముక్కలను కూడా వేసి కలపాలి.
ఇలా కలిపిన తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాళింపును వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఒక రోజు తరువాత నూనె అంతా పైకి తేలుతుంది. అప్పుడు పచ్చడిని మరోసారి అంతా కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. పచ్చడిని ఒకసారి రుచి చూసి ఉప్పును, కారాన్ని వేసుకోవాలి. నూను తక్కువగా ఉంటే నూనెను వేడి చేసి చల్లగా అయిన తరువాత పచ్చడిలో కలుపుకోవాలి. దీనిని తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.