Munakkaya Sambar : మునక్కాయ సాంబార్.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేడి వేడి అన్నంతో ఈ సాంబార్ ను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది మునక్కాయ సాంబార్ ను ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ ను తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా చాలా తేలికగా మునక్కాయ సాంబార్ ను తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కూరగాయ ముక్కలు వేయకుండా చాలా సులభంగా రుచిగా మునక్కాయ సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాయ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన కందిపప్పు – ఒక కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన క్యారెట్ – 1, తరిగిన మునక్కాయలు – 2, చిన్న ఉల్లిపాయలు – 4, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, బెల్లం – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – పావు టీస్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కాశ్మీరి ఎండుమిర్చి – 2, ఎండుమిర్చి – 4.
మునక్కాయ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పు, నీళ్లు, పసుపు, నూనె వేసి మూత పెట్టాలి. పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు, క్యారెట్, మునక్కాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి ముక్కలను వేయించాలి. ముక్కలు కొద్దిగా వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని 3 టీ స్పూన్ల మోతాదులో వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా ఉడికించిన పప్పు, బెల్లం వేసి కలపాలి. మునక్కాయ ముక్కలు మెత్తబడి సాంబార్ చిక్కబడిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాయ సాంబార్ తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఈ సాంబార్ తో తింటే కడుపు నిండుగా భోజనం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.