Mutton Fry Biryani : మటన్ ఫ్రై బిర్యానీ.. మటన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. తరచూ మటన్ తో ఒకే రకం వంటకాలు కాకుండా ఇలా ఫ్రై పీస్ బిర్యానీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ ఫ్రై బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ ఫ్రై బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మటన్ – అరకిలో, లవంగాలు – 3, యాలకులు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు -అర టీ స్పూన్, ఉప్పు -అర టీ స్పూన్, నీళ్లు – అర గ్లాస్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒక గ్లాస్,నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – రెండు చిన్నవి, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, ఉప్పు – కొద్దిగా, నీళ్లు – రెండు గ్లాసులు, నెయ్యి – ఒక టీ స్పూన్.
మటన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాట – 1, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ ఫ్రై బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో మటన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో మసాలా పదార్థాలు, నీళ్లు,ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసి మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి మటన్ మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. లేదంటే మరలా మూత పెట్టి మరో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మటన్ ను నీటితో సహా పక్కకు ఉంచాలి. తరువాత అన్నం తయారీకి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నీరంతా పోయే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మరోసారి అంతా కలుపుకుని మంటను చిన్నగా చేసి అన్నం పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మటన్ ఫ్రై ను తయారు చేసుకోవడానికి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత ఉడికించిన మటన్ ను నీటితో సహా వేసుకోవాలి.
దీనిని పెద్ద మంటపై 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మటన్ కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మంటను చిన్నగా చేసి ఉప్పు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మెంతి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ఫ్రైను ముందుగా తయారు చేసుకున్న పులావ్ అన్నంతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై బిర్యానీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ మటన్ ఫ్రై బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు.