Mutton Keema Pulao In Cooker : మనం మటన్ ఖీమాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మటన్ ఖీమాతో రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. ఖీమాతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఫ్రై, కూరలే కాకుండా ఖీమాతో మనం ఎంతో రుచిగా ఉడే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఖీమాతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఖీమా పులావ్ ను సులభంగా, త్వరగా అయ్యేలా కుక్కర్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖీమా పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, నల్ల యాలక్కాయ – 1, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 5, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఖీమా – పావుకిలో, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – పావుకిలో.
ఖీమా పులావ్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఈ మసాలాలను వేయించిన తరువాత ఖీమా వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసి ఖీమాలో ఉండే నీరంతా పోయే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి.
తరువాత 300 ఎమ్ ఎల్ నీళ్లు, నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి పెద్ద మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూతతీయకుండా అరగంట పాటు అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఖీమా పులావ్ తయారవుతుంది. దీనిని మిర్చి కా సాలన్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఎంతో రుచికరమైన ఖీమా పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.