Naga Babu : మా అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. మంచు విష్ణు తన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుపై చోరీ కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో నాగ శ్రీను తెర మీదకు వచ్చి.. విష్ణు, మోహన్ బాబులు తనను దూషించారని.. కులం పేరిట అవమానించారని చెప్పాడు. దీంతో ఈ వార్త దుమారం రేపుతోంది.
అయితే నాగశ్రీను తన తల్లి హాస్పిటల్‌లో ఉందని.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిపాడు. తనకు సహాయం చేయాలని కోరాడు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఆదుకోవాలని.. తనపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేసేలా సహాయం అందించాలని అన్నాడు. దీంతో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నాగశ్రీనుకు ఆయన ఆర్థిక సహాయం అందజేశారు.
బ్రెయిన్ స్ట్రోక్‌తో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగశ్రీను తల్లి హాస్పిటల్ ఖర్చులకు నాగబాబు రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాదు.. ఆమెకు అపోలో హాస్పిటల్‌లో చికిత్సను అందించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీకి నాగబాబు ఈ విధంగా షాకిచ్చారని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో వస్తున్న అనేక సమస్యలకు మెగా ఫ్యామిలీ స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుండడం.. మరోవైపు మంచు ఫ్యామిలీ వివాదాల్లో చిక్కుకుపోతుండడం.. చర్చనీయాంశంగా మారింది.
మెగా ఫ్యామిలీకి చెందినవారు ఓవైపు సహాయాలు చేస్తుంటే.. మంచు ఫ్యామిలీ మాత్రం ఈ విధంగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే నాగబాబు ఉన్నట్లుండి నాగశ్రీనుకు సహాయం చేయడం.. అందరి దృష్టినీ ఆయన వైపుకు తిప్పుకునేలా చేసింది. మరి ఈ విషయం ఇంకా ఎంత మేర ముందుకు వెళ్తుందో చూడాలి.