Naresh : దర్శకరత్న దాసరి నారాయణ రావు కన్నుమూశాక టాలీవుడ్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆయన ఉన్నంత కాలం ఏదైనా సమస్య ఉంటే ఆయన వద్దకు వెళ్లి పరిష్కరించుకునే వారు. కానీ ఆయన పోయాక.. పరిస్థితులు మారాయి. టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా టాలీవుడ్‌లో ఉన్న అసలు వర్గాలు బయట పడ్డాయి. అయితే ఆ ఎన్నికల అనంతరం మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తాను సినీ రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
అయితే ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో మాత్రం అటు మోహన్ బాబు, ఇటు మంచు విష్ణు కేవలం కామెంట్స్‌కే పరిమితం అయ్యారు తప్ప జగన్ ను కలిసి మాట్లాడింది లేదు. తాజాగా చిరంజీవి పలువురు హీరోలతో కలిసి వెళ్లి వచ్చిన వారం రోజుకు మంచు విష్ణు జగన్ తో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే అసలు ఇండస్ట్రీకి పెద్ద ఎవరు.. అని మరోమారు చర్చ జరుగుతోంది. అయితే టాలీవుడ్ కు మాత్రం మోహన్‌బాబే అసలైన పెద్ద అని సీనియర్ నటుడు నరేష్ వ్యాఖ్యానించారు.
మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా ఈ నెల 18వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నరేష్ మాట్లాడారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్న మోహన్ బాబు.. అని నరేష్ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
అయితే ఇన్ని రోజుల నుంచి ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల సమస్య ఉంటే మోహన్ బాబు, మంచు విష్ణు ఏమయ్యారని.. మధ్యలో నరేష్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదని.. నెటిజన్లు అంటున్నారు. చిరంజీవి మొదటి నుంచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని.. ఏమీ చేయని మోహన్ బాబు ఇండస్ట్రీకి పెద్ద ఎలా అవుతారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండస్ట్రీ పెద్ద అయితే సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం చేయాలి కానీ.. ఇలా ఏమీ పట్టనట్లు కూర్చుంటే.. పెద్ద ఎలా అవుతారని అంటున్నారు.
అయితే సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేయనున్న నేపథ్యంలో ఆ జీవో వచ్చాక.. ఈ మొత్తం వ్యవహారానికి చిరంజీవికే క్రెడిట్ దక్కుతుంది. కానీ అందుకు మోహన్ బాబు వర్గం వారు ఏమంటారో చూడాలి.