Mosquito Repellent : ప్రస్తుత వర్షాకాలంలో మనకు ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యల్లో జ్వరాలు కూడా ఒకటి. మనం ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడుతూ ఉంటాం. ఈ జ్వరాలు మనకు దోమల ద్వారా వస్తాయని మనందరికీ తెలుసు. ఈ దోమల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అపరిశుభ్ర వాతావరణం, నీరు ఎక్కువగా నిల్వ ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మనం దోమకాటుకు గురవడం, మన ఇంట్లోకి దోమలు రావడం జరుగుతూనే ఉంటుంది. దోమలతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. మనకు మార్కెట్ లో దోమలను నివారించే అనేక రకాల పరికరాలు, సాధనాలు ఉన్నప్పటికీ అవి అంత సురక్షితమైనవి కావు. దోమలను నివారించే సాధనాలలో రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కనుక వీటి నుండి వచ్చే వాసనను పీల్చడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సహజ సిద్దంగా కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మన ఇంట్లో ఉండే దోమలను నివారించుకోవచ్చు. దోమలను నివారించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో తలుపులను, కిటికీలను మూసి వేసి కర్పూరాన్ని వెలిగించి దాని నుండి వచ్చే పొగను ఇళ్లంతా వచ్చేలా చూసుకోవాలి. లేదా కర్పూరాన్ని పొడిగా చేసి దానికి వేప నూనెను కలిపి దీపం వెలిగించాలి. లేదా ఈ మిశ్రమాన్ని దోమలను నివారించే రిఫిల్స్ లో పోసి ఆన్ చేయాలి. ఇలా చేసినా కూడా ఇంట్లో ఉండే దోమలు బయటకు వెళ్లిపోతాయి.
వెల్లులి రెబ్బలను నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని ఇంట్లో స్ప్రే చేయడం వల్ల కూడా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఉల్లిపాయను మూడు లేదా నాలుగు ముక్కలుగా చేసి కిటికీల దగ్గర ఉంచినా కూడా మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలను అడ్డంగా ముక్కలను కోసి ఆ ముక్కలో లవంగాలను గుచ్చి ఇంట్లో అక్కడక్కడ ఉంచినా కూడా దోమలు పోతాయి. కొబ్బరి నూనె, వేప నూనెను సమానంగా తీసుకుని శరీరానికి రాసుకోవడం వల్ల దోమలు మనల్ని కుట్టకుండా ఉంటాయి.
పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి ఆ నీటిని బాటిల్‌లో పోసి ఇంట్లో స్ర్పే చేసుకోవడం వల్ల కూడా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉండడంతోపాటు ఇంట్లోని దోమలు కూడా బయటకు పోతాయి. వీటితోపాటు ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. హానికర రసాయనాలను వాడడానికి బదులుగా ఈ చిట్కాలను పాటించడం వల్ల దోమలు రాకుండా ఉండడమే కాకుండా మనకు కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.