Neerothulu : నీరొత్తులు.. గోధుమపిండితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చిరుతిళ్లు లేని పాతకాలంలో కేవలం రెండే రెండు పదార్థాలతో ఈ నీరొత్తులను తయారు చేసే వారు. వీటిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చాలా సులభంగా నీరొత్తులను తయారు చేసి తీసుకోవచ్చు. నీరొత్తులను ఎలా తయారు చేసుకోవాలి.. వీటిని తయారు చేయడానికి కావల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నీరోత్తుల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు.
నీరోత్తుల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. దీనిని 5 నుండి 10 నిమిషాల పాటు నొక్కుతూ బాగా కలుపుకోవాలి. తరువాత పిండిని రెండు భాగాలుగా చేసి ఒక భాగంపై మూత పెట్టి మరో భాగాన్ని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పలుచగా వత్తుకోవాలి. తరువాత చాకుతో ఈ చపాతీని చతురస్రాకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇలాగే ముక్కలుగా ఉడికించవచ్చు లేదా చిన్న వత్తుల ఆకారంలో లేదా మనరకు నచ్చిన ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత గిన్నెలో బెల్లం, నీరు పోసి వేడి చేయాలి.
బెల్లం కరిగిన తరువాత నీరొత్తులను వేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి. తరువాత వీటినిచిన్న మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నీరొత్తులు తయారవుతాయి. వీటిని బెల్లం నీటితో సర్వ్ చేసుకోవచ్చు లేదా బెల్లం నీరు లేకుండా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అప్పటికప్పుడు చాలా సులభంగా రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా నీరొత్తులను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.