Nimmakaya Rasam : నిమ్మకాయ‌ల‌తో వేడి వేడిగా ఇలా ర‌సం చేసి తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Nimmakaya Rasam : నిమ్మకాయ ర‌సం.. నిమ్మ‌ర‌సంతో ఈ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు, జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఇలా నిమ్మ‌కాయ ర‌సాన్ని చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ ర‌సాన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చాలా త్వ‌ర‌గా చాలా త‌క్కువ స‌మ‌యంలో ఈ ర‌సాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, పుల్ల పుల్ల‌గా క‌మ్మ‌గా ఉండే ఈ నిమ్మ‌కాయ ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కందిప‌ప్పు – పావు క‌ప్పు, త‌రిగిన ట‌మాటాలు – 3, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌చ్చా ప‌చ్చాగా దంచిన అల్లం – ఒక అంగుళం ముక్క‌, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – 2 గ్లాసులు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మకాయ – ఒక పెద్ద నిమ్మ‌కాయ‌.

Nimmakaya Rasam recipe make like this and taste with rice
Nimmakaya Rasam

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

నిమ్మకాయ ర‌సం త‌యారీ విధానం..

ముందుగా కందిపప్పును ఉడికించి మెత్త‌గా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత కుక్క‌ర్ లో ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, అల్లం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ఇందులో ఉడికించిన ప‌ప్పు, మ‌రో గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఈ కుక్క‌ర్ ను స్ట‌వ్ మీద ఉంచి మ‌ర‌లా వేడి చేయాలి. ఇందులోనే కొత్తిమీర, నిమ్మ‌కాయ ర‌సం వేసి ర‌సం ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని ర‌సంలో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మ‌కాయ ర‌సం త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన నిమ్మ‌కాయ ర‌సాన్ని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts