Noodles Omelette : మనకు సాయంత్రం సమయాల్లో రోడ్ల పక్కన బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో నూడుల్స్ ఆమ్లెట్ కూడా ఒకటి. నూడుల్స్ మరియు ఆమ్లెట్ కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ను ఒక్కటి తింటే చాలు మన కడుపు నిండిపోతుంది. అలాగే ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ నూడుల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నూడుల్స్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 200 ఎమ్ ఎల్, మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ – 1 ( చిన్నది), చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టీస్పూన్స్, క్యారెట్ తురుము- 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము -ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
నూడుల్స్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక నూడుల్స్ వేసి కలపాలి. తరువాత ఇందులో ఉండే మసాలా పొడిని కూడా వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. నూడుల్స్ ఉడికిన తరువాత క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మూత పెట్టి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో గిన్నెలో కోడిగుడ్లను వేసుకోవాలి. తరువాత ఇందులో ఆమ్లెట్ కు కావల్సిన పదార్థాలు వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
తరువాత దీనిపై ముందుగా తయారు చేసిన కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై నూడుల్స్ ను వేసుకోవాలి. ఈ నూడుల్స్ ను ఆమ్లెట్ సగానికి వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఆమ్లెట్ ను సగానికి మడిచి మరో రెండు నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లెట్ నూడుల్స్ తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో తరచూ చేసే స్నాక్స్ తో పాటు అప్పుడప్పుడూ ఇలా ఆమ్లెట్ నూడుల్స్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు.