Nuvvula Pulusu : మన శరీరానికి నువ్వులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. నువ్వులతో అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. వీటిల్లో నువ్వుల లడ్డూలు ఒకటి. వీటిని తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల్లో ఉండే కాల్షియం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అలాగే నువ్వుల్లో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇలా నువ్వులతో అనేక లాభాలను పొందవచ్చు. అయితే నువ్వులతో పులుసు కూడా తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – ముప్పావు టీస్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు, కొత్తిమీర తురుము – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ – ఒకటి, బెల్లం తురుము – రెండు టేబుల్ స్పూన్లు, పచ్చి మిర్చి – 4, ఆవాలు – అర టీస్పూన్, మెంతులు – పావు టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ఎండు మిర్చి – 2, నూనె – 1 టీస్పూన్.
నువ్వుల పులుసును తయారు చేసే విధానం..
ముందుగా బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నానబెట్టిన బియ్యం, నువ్వులు, కొబ్బరి తురుములకి కొన్ని నీళ్లు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి కాస్త వేగాక, మెత్తగా రుబ్బిన నువ్వులు, కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. తరువాత సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. చివరగా చింతపండు గుజ్జు, బెల్లం తురుము వేసి మరికాసేపు మరిగించి కొత్తిమీర తురుము చల్లి దించాలి. చల్లారిన తరువాత తింటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది.