Oats Pongal : ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు సహాయపడతాయి. ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మనం సులభంగా ఓట్స్ తో చేసుకోదగిన వంటకాల్లో ఓట్స్ పొంగల్ కూడా ఒకటి. ఓట్స్ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ పొంగల్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ పొంగల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – అర కప్పు, ఓట్స్ – ఒక కప్పు, నీళ్లు – మూడున్నర కప్పులు, ఉప్పు – తగినంత, నెయ్యి – పావు కప్పు, ఇంగువ – పావు టీ స్పూన్, జీడిపప్పు – 10 నుండి 12, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం తరుగు – కొద్దిగా, దంచిన మిరియాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
ఓట్స్ పొంగల్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పెసరపప్పును వేసి దోరగా వేయించాలి. తరువాత ఈ పప్పును కుక్కర్ లో వేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఈ పప్పును మెత్తగా ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ఓట్స్ వేసి వేయించాలి. ఓట్స్ దోరగా వేగిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఈ ఓట్స్ ను కలుపుతూ మెత్తగా ఉడికించాలి. ఓట్స్ ఉడికిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పప్పును వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఇంగువ, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర, అల్లం తరుగు, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పొంగల్ లో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ పొంగల్ తయారవుతుంది. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈవిధంగా ఓట్స్ తో పొంగల్ తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.