Oats Upma : ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్ ని పాలతో తీసుకోవడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఓట్స్ తో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఓట్స్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఓట్స్ ఉప్మా కూడా ఒకటి. ఓట్స్ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించేలా ఓట్స్ తో ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, అల్లం తురుము – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒకటిన్నర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఓట్స్ ఉప్మా తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఓట్స్ వేసి 2 నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అల్లం తురుము వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత ఓట్స్ వేసి కలపాలి. ఓట్స్ మెత్తగా అయ్యి దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ ఉప్మా తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.