Okra Rice : బెండకాయ రైస్‌.. చాలా రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం..!

Okra Rice : బెండకాయలను చాలా మంది వేపుడు లేదా పులుసు రూపంలో తీసుకుంటుంటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండుతుంటారు. అయితే ఇవేవీ నచ్చని వారు బెండకాయలతో రైస్‌ చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. బెండకాయలతో మనకు అనేక పోషకాలు లభిస్తాయి. కనుక వీటిని తరచూ తినాలి. ఇక బెండకాయలతో రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Okra Rice is very healthy make it in this way
Okra Rice

బెండకాయ రైస్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

బెండకాయ ముక్కలు – పావు కేజీ, ఎండు కొబ్బరి – పావు కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, కారం – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, పల్లీలు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 6, ఆవాలు – ఒక టీస్పూన్‌, జీలకర్ర – ఒక టీస్పూన్‌, శనగ పప్పు – ఒక టీస్పూన్‌, మినప పప్పు – ఒక టీస్పూన్‌, ఎండు మిర్చి – 3, పచ్చి మిర్చి – 4, కరివేపాకు – 2 రెబ్బలు, నూనె – 4 టేబుల్‌ స్పూన్లు, అన్నం – పావు కేజీ బియ్యం ఉడికించాలి.

బెండకాయ రైస్‌ తయారు చేసే విధానం..

మిక్సీలో ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేయాలి. స్టవ్‌ మీద బాణలిలో నూనె వేసి కాగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి, మూత పెట్టాలి. రెండు నిమిషాల తరువాత మూత తీసి చిటికెడు ఉప్పు జత చేసి ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి. అదే బాణలిలో పల్లీలు వేసి వేయించాలి. ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప పప్పు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. అన్నం జత చేయాలి. పుట్నాల కారం జత చేసి అన్నీ కలిసే వరకు బాగా కలపాలి. వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూడు నిమిషాల తరువాత దింపేయాలి. దీంతో రుచికరమైన బెండకాయ రైస్‌ తయారవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు.

బెండకాయలతో కూరలు తినలేనివారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. దీని వల్ల బెండకాయల్లో ఉండే పోషకాలను పొందవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

Admin

Recent Posts