Sweat : వేసవి కాలంలో సహజంగానే మనకు చెమట అధికంగా వస్తుంటుంది. శరీరం వేడిగా అవుతుంది కనుక.. దాన్ని చల్లబరిచేందుకు చెమట ఉత్పత్తి అవుతుంది. అయితే కొందరిలో చెమట బాగా వచ్చి దుర్వాసనగా ఉంటుంది. కొద్దిగా చెమట పట్టినా.. దుర్వాసన మాత్రం అధికంగానే ఉంటుంది. అయితే ఈ సమస్యకు దిగులు చెందాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే చెమట దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..
1. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో అంతే మొత్తంలో నిమ్మరసం కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చెమట బాగా పట్టే ప్రదేశాల్లో రాయాలి. పది నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే చెమట దుర్వాసన సమస్య తగ్గుతుంది.
2. చెమట పట్టే ప్రదేశాల్లో టమాటా రసాన్ని రాస్తున్నా.. ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో చెమట పట్టినా దుర్వాసన రాకుండా ఉంటుంది.
3. ముల్లంగి రసంలో కాస్త గ్లిజరిన్ కలిపి ఉపయోగించినా చెమట దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.
4. నిమ్మకాయలను అడ్డంగా కోసి ఆ ముక్కలతో చెమట పట్టే చోట్లలో రుద్దాలి. తరువాత 10 నిమిషాలు అలాగే ఉండి కడిగేయాలి. ఇలా కూడా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
5. ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఒక చిన్న వస్త్రాన్ని ముంచి చెమట పట్టే చోట్లలో రాయాలి. పది నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తున్నా కూడా చెమట దుర్వాసన సమస్య తగ్గుతుంది.