Onion Pesarattu : పెసర్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉల్లి పెసరట్టు కూడా ఒకటి. ఉల్లిపెసరట్టు చాలా రుచిగా ఉంటుంది. మనం హోటల్స్ లో కూడా ఉల్లిపెసరట్టు లభిస్తూ ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసర్లతో చేసే ఈ పెసరట్టును తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ ఉల్లి పెసరట్టును మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా అందరికి నచ్చేలా ఉల్లి పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి పెసరట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు పెసరపప్పు లేదా పెసర్లు – ఒక గ్లాస్, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – పెద్దది ఒకటి, ఉప్పు – తగినంత, నెయ్యి – కొద్దిగా, పచ్చిమిర్చి – 2, అల్లం – అర ఇంచు ముక్క.
ఉల్లి పెసరట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసర్లను తీసుకోవాలి. ఇందులోనే బియ్యాన్ని కూడా వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పెసర్లను మరోసారి కడిగి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి ఉల్లిపాయతో లేదా టిష్యు పేపర్ తో తుడుచుకోవాలి.
తరువాత తగినంత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిపోయిన తరువాత దానిపై ఉల్లిపాయ ముక్కలు, జీలకర్రను కలిపి వేసుకోవాలి. దీనిని నెయ్యి వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లి పెసరట్టు తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా చేసిన ఉల్లి పెసరట్టును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.