Onion Puri Curry : మనం అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. పూరీలను తినడానికి మనం ప్రత్యేకంగా పూరీ కూరను తయారు చేస్తూ ఉంటాం. ఈ కూర రుచిగా ఉంటేనే పూరీలు రుచిగా ఉంటాయి. పూరీ కూరను మనం ఉల్లిపాయలతో కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే పూరీ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే ఆనియన్ పూరీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ పూరీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 3, చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్ – 1, పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – అర టీ స్పూన్, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆనియన్ పూరీ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చిబఠాణీ వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసి కలపాలి.
తరువాత వీటిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత అందులో ముందుగా కలిపిన శనగపిండి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి. తరువాత కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పూరీ కూర తయారవుతుంది. దీనిని పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరతో పూరీలను తింటే ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తినేస్తారు.