Onion Samosa : సమోసాలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. మనకు అనేక రుచులల్లో సమోసాలు లభిస్తాయి. వీటిని రుచిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా చేయడానికి సులువుగా, ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ సమోసాలను తయారు చేసుకునే విధానాన్ని, తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – రెండు కప్పులు, వాము – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీల కర్ర పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, నూనె – డీ ఫ్రైకి సరిపడా.
ఉల్లిపాయ సమోసా తయారు చేసే విధానం..
ముందుగా మైదా పిండిలో ఒక టీ స్పూన్ నూనె, వాము వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత ఈ పిండిని మధ్యస్థ పరిమాణంలో ముద్దలుగా చేసి చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీల చేసుకున్న వాటిని పెనం పై ఉంచి 10 సెకన్ల వ్యవధిలో రెండు దిక్కులా కొద్దిగా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని దీర్ఘ చతురస్రాకారంలో కావల్సిన పరిమాణంలో కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మరో గిన్నెలో కొద్దిగా మైదా పిండి వేసి నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసిపెట్టుకున్న వాటిని సమోసా ఆకారంలో చేసి అందులో ముందుగా కలిపిన ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి, అంచులకు పేస్ట్ లా చేసిన మైదా పిండిని రాస్తూ సమోసాలు చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగాక, ముందుగా చేసిన సమోసాలను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రంచీ గా ఉండే ఉల్లిపాయ సమోసాలు తయారవుతాయి. వీటిని పుదీనా చట్నీ లేదా టమాటా సాస్ లతో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.