Pachi Chinthakaya Pachadi : చలికాలంలో మనకు పచ్చి చింతకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి చింతకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, డయాబెటిస్ ను నియంత్రించడంలో, దగ్గు మరియు జలుబును తగ్గించడంలో ఈ చింతకాయలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పచ్చి చింతకాయలను ఉపయోగించి చేసే వంటకాలు చాలారుచిగా ఉంటాయి. వీటితో మనం ఎంతో రుచిగా ఉండే చింతకాయ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. పచ్చి చింతకాయలతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి చింతకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి చింతకాయలు – 300 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 25 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, జీలకర్ర.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
పచ్చి చింతకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తరువాత వీటన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత మరో జార్ లో చింతకాయలు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పొడి వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి చింతకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మూడు నుండి నాలుగు రోజుల పాటు తాజాగా ఉంటుంది. పచ్చి చింతకాయలు దొరికినప్పుడు ఇలా వాటితో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.