Cold And Cough : మనం సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటాం. పిల్లలు మాత్రం తరచూ ఈ సమస్యల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడగానే చాలా మంది దగ్గు సిరప్ లను, యాంటా బయాటిక్ మందులను వాడుతూ ఉంటారు. ఈ మందులను వాడినా వాడకపోయినా దగ్గు, జలుబు వంటి సమస్యలు వారం నుండి పదిరోజుల్లో తగ్గుతాయి. అయితే ఈ మందుల కంటే ప్రకృతి ప్రసాదించిన మసాలా దినుసులను వాడడం వల్ల మనం మరింత త్వరగా వాటి నుండి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడినప్పుడు మందుల కంటే ఈ మసాలా దినుసులను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ సమస్యల బారిన పడినప్పుడు వేడి నీటిని తాగుతూ ఉండాలి.
టీ, కాఫీలను తాగినట్టుగా వేడి నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, శ్లేష్మం అంతా బయటకు వస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల శ్లేష్మం పలుచబడి త్వరగా తొలగిపోతుంది. అలాగే గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వేడి నీటితో పాటు దగ్గు, జలుబు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. తరువాత అందులో 10 మిరియాలను కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని, అర టీ స్పూన్ పసుపును, గుప్పెడు తులసి ఆకులను వేసి నీటిని మరిగించాలి. ఈ నీటిని ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు బాగా మరిగించి వడకట్టుకుని కప్పులోకి తీసుకోవాలి. తరువాత అందులో రుచికి తగినంత తేనెను కలిపి వేడి వేడిగా కాఫీలా తాగాలి. ఇలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగడం వల్ల జలుబు, దగ్గు నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు.
ఈ కషాయం దగ్గు సిరప్ , యాంటీ బయాటిక్ మందుల కంటే చక్కగా పని చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కషాయాన్ని తాగడం వల్ల శ్వాస మార్గం తేలికపడి శ్వాస చక్కగా అందుతుంది. ఈ కషాయాన్ని తయారు చేయడానికి వాడిన పదార్థాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కషాయాన్ని ఘాటు తగ్గించి తయారు చేసి పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. అలాగే ఈ దగ్గు, జలుబు వంటి సమస్యలు ఇబ్బందిపెడుతున్నప్పుడు మధ్యాహ్నం ఒక్కపూట మాత్రమే భోజనం చేసి మిగిలిన రెండు పూటలా వేడి నీటిని , నిమ్మకాయ నీటిని, కషాయాన్ని తాగుతూ ఉండాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి మందులు వాడే పనిలేకుండా దగ్గు, జలుబుల నుండి సత్వర ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.