Pakundalu : మనం పండుగలకు రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. పండుగలకు ఎక్కువగా చేసే తీపి వంటకాల్లో పాకుండలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ పాకుండలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత కమ్మగా ఉంటాయి. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మొదటిసారి చేసే వారు కూడా వీటిని సులువుగా తయారు చేసుకోవచ్చు. కమ్మటి రుచితో సులవుగా ఈ పాకుండలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాకుండలు తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒకటిన్నర గ్లాస్, నువ్వులు – 2 టీ స్పూన్స్, నెయ్యి – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, బెల్లం తురుము – ముప్పావు గ్లాస్, నీళ్లు – పావు గ్లాస్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పాకుండల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఈ బియ్యాన్ని రెండు రోజుల పాటు నానబెట్టాలి. రోజుకు మూడు నుండి నాలుగు సార్లు నీళ్లు మారుస్తూ బియ్యాన్ని కడుగుతూ ఉండాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత బియ్యాన్ని జల్లిగిన్నెలోకి తీసుకుని నీరంతా పోయేలాచేసుకోవాలి. తరువాత ఈ బియ్యాన్ని జార్ లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని జల్లించి దానిపై మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక కొబ్బరి ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దానిని వడకట్టుకుని మళ్లీ అదే కళాయిలోకి తీసుకుని ఉడికించాలి. బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే మెత్తని ఉండలా తయారవ్వాలి. ఇలా బెల్లాన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వెంటనే వేయించిన నువ్వులు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. తరువాత జల్లించిన పిండిని వేసుకుంటూ వెంట వెంటనే కలుపుతూ ఉండాలి. ఇలా గంటె జారుడుగా పిండిని కలుపుకుని కొద్దిగా చల్లారే వరకు ఉంచాలి. పిండి కొద్దిగా చల్లారిన తరువాత చేతికి నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గుండ్రటి ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తయారు చేసుకున్న ఉండలను వేసి వేయించాలి. వీటిని కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అ య్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాకుండలు తయారవుతాయి. వీటిలో గసగసాలను, పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పాకుండలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పండుగలకు, ప్రత్యేక రోజులకు ఇలా ఎంతో రుచిగా ఉండే పాకుండలను తయారు చేసుకుని తినవచ్చు.