Smooth Rava Laddu : మనం శనగపిండితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చిరుతిళ్లతో పాటు పిండి వంటకాలను, తీపి వంటకాలను కూడా శనగపిండితో తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ శనగపిండితో మనం ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు చాలా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. శనగపిండితో రవ్వలడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి రవ్వ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, కరిగించిన నెయ్యి – అర కప్పు, జీడిపప్పు – 8, బాదం పప్పు – 8, ఎండుద్రాక్ష – 8, పంచదార – ఒక కప్పు, యాలకులు – 3, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
శనగపిండి రవ్వ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వ, శనగపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత 5 టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా లేదా నచ్చిన ఆకారంలో ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రవ్వ ఉండలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత తయారు చేసుకున్న ఉండలు చల్లారిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి.
నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ ను వేసి వేయించాలి. డ్రైఫ్రూట్స్ చక్కగా వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పంచదార, ముప్పావు కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే యాలకులను దంచి వేసుకోవాలి. పంచదార కరిగి లేత తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇలా లేత తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు అలాగే ఉంచాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమంలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పంచదార మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా రవ్వ మివ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపిండి రవ్వ లడ్డూ తయారవుతుంది. తరచూ చేసే రవ్వ లడ్డూ కంటే ఈ విధంగా చేసిన రవ్వ లడ్డూ మరింత రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు, ప్రత్యేక సందర్భాల్లో, పండుగలకు ఇలా శనగపిండితో రవ్వ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ శనగపిండి రవ్వ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.