Palak Egg Porutu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పాలకూరతో తరచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా కోడిగుడ్లు వేసి చేసే పాలక్ ఎగ్ పొరుటు కూడా చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, తేలికగా పాలకూర ఎగ్ పొరుటును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ ఎగ్ పొరుటు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, తరిగిన పాలకూర – 70 గ్రాములు, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, కోడిగుడ్లు – 4, ధనియాల పొడి – ఒక టీ స్పూన్.
పాలక్ ఎగ్ పొరుటు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో పావు కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, పసుపు వేసి కలిపి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పాలకూర వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత ఉప్పు, కారం వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత కోడిగుడ్లను వేసి కలపాలి. కోడిగుడ్డు కీమాలా అయేంత వరకు 4 నుండి 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
కోడిగుడ్డు చక్కగా వేగిన తరువాత ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ ఎగ్ పొరుటు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పాలకూరతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. పాలకూరను తినని పిల్లలకు ఈ విధంగా పాలకూర ఎగ్ పొరుటు చేసి పెట్టడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చు.