Palakura Pappu Recipe : మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర ఒకటి. పాలకూరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. పాలకూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలకూరతో చేసుకోదగిన వంటకాల్లో పాలకూర పప్పు కూడా ఒకటి. సరిగ్గా చేయాలే కానీ ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. పాలకూర పప్పు రుచిగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – ఒక పెద్ద కట్ట, కందిపప్పు – 150 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, నానబెట్టిన చింతపండు – 20 గ్రా., శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెబ్బ, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, నీళ్లు – 300 ఎమ్ ఎల్.
పాలకూర పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును వేసి బాగా కడగాలి. తరువాత తరిగిన పాలకూరను, ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని, పసుపును వేయాలి. తరువాత 200 ఎమ్ ఎల్ నీటిని పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, చింతపండు రసం వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత 100 ఎమ్ ఎల్ నీటిని పోసి కలపాలి. దీనిని మరలా స్టవ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. పప్పు ఉడుకుతుండగానే మరో కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. చివరగా ఇంగువను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తాళింపును ఉడుకుతున్న పప్పులో వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలకూరతో పప్పును తయారు చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.