Paneer Fried Rice : పనీర్.. పాలతో చేసే పదార్థాలల్లో ఇది కూడా ఒకటి. పనీర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో ఎక్కువగా మనం మసాలా కూరలను, స్నాక్ ఐటమ్స్ ను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో ఇవే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి ఈ ఫ్రైడ్ రైస్ చాలా చక్కగా ఉంటుంది. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా పనీర్ తో ఫ్రైడ్ రైస్ చేసి తీసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ ను తయారు చేయడం చాలా సులభం. అందరికి నచ్చేలా పనీర్ తో ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, క్యారెట్ తరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన బీన్స్ – 5, అన్నం – ఒక కప్పు బాస్మతీ బియ్యంతో వండినంత, ఉప్పు – తగినంత, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ – అర టీ స్పూన్, ఆరోమెటిక్ పౌడర్ – అర టీస్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.
పనీర్ వేయించడానికి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, పనీర్ – 200 గ్రా., టమాట కిచప్ – ఒక టేబుల్ స్పూన్, కారం – చిటికెడు, ఉప్పు – చిటికెడు.
పనీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పనీర్ వేసి వేయించాలి. తరువాత టమాట కిచప్, ఉప్పు, కారం వేసి కలపాలి. పనీర్ లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు వేసి వేయించాలి. క్యారెట్ వేగిన తరువాత అన్నం వేసి కలపాలి.తరువాత మిగిలిన పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. చివరగా వేయించిన పనీర్ వేసి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పనీర్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు ఇలా ఫ్రైడ్ రైస్ ను కూడా తయారు చేసి తీసుకోవచ్చు.