Paneer Lollipop : సాయంత్రం సమయంలో చాలా మంది సహజంగానే అనేక రకాల స్నాక్స్‌ను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా నూనెతో చేసిన ఆహారాలను తింటుంటారు. అయితే ఏవి పడితే అవి తినకుండా కేవలం ఇంట్లో చేసినవి.. అవి కూడా ఆరోగ్యానికి హాని చేయనివి తింటేనే మనకు ప్రయోజనం కలుగుతుంది. అలాంటి వాటిలో పనీర్ లాలీపాప్స్ కూడా ఒకటి. వీటిని సాధారణంగా రెస్టారెంట్లలో మనకు అందిస్తుంటారు. కానీ కాస్త శ్రమిస్తే ఎంతో రుచిగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే పనీర్ లాలిపాప్స్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ లాలిపాప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సోయాకీమా – అర కప్పు, పనీర్ తురుము – ముప్పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంప – ఒకటి, అల్లం తరుగు – పావు టీస్పూన్, పచ్చి మిర్చి ముక్కలు – 2 టీస్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ఎండుమిర్చి గింజలు – అర టీస్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, నిమ్మరసం – రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, బియ్యం పిండి – మూడు టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి – అర కప్పు, నూనె – వేయించేందుకు సరిపడా, ఐస్‌క్రీమ్ పుల్లలు – కొన్ని.
పనీర్ లాలిపాప్స్‌ను తయారు చేసే విధానం..
సోయాకీమాలో కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 5 నిమిషాలు అయ్యాక దింపేయాలి. వేడి చల్లారాక నీళ్లు పిండేసి కీమాను ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. నిమ్మకాయంత ఉండను తీసుకుని లాలిపాప్ ఆకృతిలో వచ్చేలా చేసి ఐస్‌క్రీమ్ పుల్లను గుచ్చాలి. అదేవిధంగా అన్నీ వేసుకుని రెండు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీయాలి. దీంతో ఎంతో రుచికరమైన పనీర్ లాలిపాప్స్ రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా సాస్‌లో ముంచుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. ఒకసారి రుచి చూశారంటే ఎవరూ వీటిని అసలు విడిచిపెట్టరు. ఎప్పుడూ రొటీన్ స్నాక్స్ చేసేందుకు బదులుగా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. బాగుంటాయి.