Bheemla Nayak Movie Review : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే చాలు.. ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన లేటెస్ట్ మూవీ.. భీమ్లా నాయక్.. శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళయాళం చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. కథ దాదాపుగా అలాగే ఉన్నప్పటికీ పవన్ కోసం పలు మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ..
భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) ఓ నిజాయితీ గల పోలీస్ అధికారి. ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అదే ఊరిలో డానియెల్ శేఖర్ (రానా) పేరు, పలుకుబడి కలిగి ఉంటాడు. ఓ సమయంలో డానియెల్ ను భీమ్లా నాయక్ అరెస్టు చేస్తాడు. దీంతో డానియెల్ ఈగో దెబ్బ తింటుంది. ఈ క్రమంలో డానియెల్ ఏం చేశాడు ? అందుకు భీమ్లా నాయక్ ఎలా ప్రతిఘటించాడు ? చివరకు ఈ పోరులో ఎవరు గెలుస్తారు ? అన్న విషయాలను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు బాగుంది. పవన్ కల్యాణ్, రానాలు అద్భుతమైన నటులు కనుక వారి పెర్ఫార్మెన్స్‌కు పేరు పెట్టాల్సిన పనిలేదు. అలాగే హీరోయిన్స్ నిత్య మీనన్, సంయుక్త మీనన్‌లు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. ఇతర నటీనటులు కూడా ఫర్వాలేదనిపించారు. అయితే సినిమాలో పవన్, రానాల మధ్య ఉండే ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇద్దరూ పేల్చే డైలాగ్స్ ప్రేక్షకులచే విజిల్స్ కొట్టిస్తాయి.
మొత్తంగా చెప్పాలంటే.. పవన్ కల్యాణ్ మరోసారి తన మ్యాజిక్‌ను ఈ సినిమాలో చూపించారని చెప్పవచ్చు. సంగీతం కూడా బాగుంది. ఎన్నో రోజుల తరువాత థియేటర్లో విడుదలైన ఓ అగ్రహీరో సినిమా ఇది. పవన్ కల్యాణ్ అభిమానులకే కాదు.. ఇతర ప్రేక్షకులకు కూడా ఈ మూవీ చక్కని వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. కనుక ఈ సినిమాను కచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒకసారి చూడవచ్చు.