Perfect Muddapappu : ముద్ద పప్పు.. ఇది తెలలియని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ముద్దపప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఆవకాయతో పాటు ఇతర పచ్చళ్లతో కూడా దీనిని తింటూ ఉంటారు. ముద్దపప్పు అనగానే చాలా మంది కందిపప్పును మెత్తగా ఉడికించడమే అనుకుంటూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా తయారు చేసే ముద్దపప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాతకాలంలో తయారు చేసేవారు. అన్నం తినే పసి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా దీనిని ఆహారంగా పెట్టవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసిన ముద్దపప్పును తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. పచ్చళ్లతో తినడానికి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. మరింత రుచిగా, కమ్మగా ముద్దపప్పును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్ద పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్.
ముద్ద పప్పు తయారీ విధానం..
ముందుగా కళాయిలో కందిపప్పును వేసి దోరగా వేయించాలి. తరువాత ఈ పప్పును కుక్కర్ లో వేసి శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు, పసుపు వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తరువాత మూత తీసి ఉప్పు వేసి కలపాలి. తరువాత పప్పు గుత్తితో పప్పును మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఇంగువ, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత దీనిని పప్పులో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ముద్ద పప్పు తయారవుతుంది. దీనిని నేరుగా అన్నంతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పప్పును తీసుకోవడం వల్ల వాతం చేయకుండా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.