Pesarla Pachadi : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెసర్లు కూడా ఒకటి. పెసర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పెసర్లను ఎక్కువగా మొలకెత్తించి తీసుకుంటూ ఉంటాము. అలాగే వీటితో పెసరట్టు, కిచిడీ, గుగ్గిళ్లు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా పెసర్లతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పెసర్ల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర్ల పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర్లు – ఒక కప్పు, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 15, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 3, నూనె – ఒక టేబుల్ స్పూన్, బెల్లం – ఒక చిన్న ముక్క, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, పసుపు – పావు టీ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు.
పెసర్ల పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పెసర్లు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించాలి. పెసర్లు సగం వేగిన తరువాత మెంతులు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. పెసర్లు చక్కగా వేగి ఎర్రగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చింతపండును నీటితో సహా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
అవసరమైతే కొద్దిగా నీటిని కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళంపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర్ల పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఈ విధంగా పెసర్లతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.