Kobbari Junnu : కొబ్బరి జున్ను.. పచ్చికొబ్బరితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ కొబ్బరి జున్నును తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ పంచదారతో చేసే తీపి వంటకాలే కాకుండా బెల్లంతో చేసే ఈ కొబ్బరి జున్నును తినడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఈ కొబ్బరి జున్నును తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ కొబ్బరి జున్నును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి జున్ను తయారీకి కావల్సిన పదార్థాలు..
యాలకులు – 4, మిరియాలు – ఒక టీ స్పూన్,4 గంటల పాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు.
కొబ్బరి జున్ను తయారీ విధానం..
ముందుగా జార్ లో యాలకులు, మిరియాలు వేసి బరకగా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బియ్యం, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బెల్లం తురుము, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి, ఒక టీ స్పూన్ యాలకులు మరియు మిరియాల పొడి వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. తరువాత అడుగును మిగిలిన మిరియాల పొడిని చల్లుకోవాలి. తరువాత కొబ్బరి మిశ్రమం వేసి బుడగలు లేకుండా గిన్నెను తట్టాలి.
తరువాత మూత పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. ఇందుకోసం ఒక గిన్నెలో స్టాండ్ ను ఉంచి నీటిని పోయాలి. తరువాత మూత ఉంచి సిద్దండా ఉంచిన గిన్నెను స్టాండ్ పై ఉంచి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టాలి. దీనిని 30 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై, 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గిన్నెను బయటకు తీసి చల్లారిన తరువాత అంచులను వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిని మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి జున్ను తయారవుతుంది. దీనిని పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.