Poha Bites : మనం అటుకులతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయం కూడా చాలా సులభం. మనం అటుకులతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పోహ బైట్స్ కూడా ఒకటి. పోహ బైట్స్ చాలా రుచిగా ఉంటాయి. ఇవి బయట క్రిస్సీగా లోపల మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అటుకులు ఉంటే చాలు వీటిని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా ఉండే పోహ బైట్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా బైట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
లావు అటుకుల – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, నిమ్మరసం – అర చెక్క, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
పోహ బైట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకోవాలి. తరువాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. దీనిని పిండి ముద్దలా చేసుకున్న తరువాత బంగాళాదుంపలను తురిమి వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ కట్లెట్ ల ఆకారంలో వత్తుకోవాలి. లేదంటే మనకు నచ్చిన ఆకారంలో వత్తుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పోహ బైట్స్ ను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పోహబైట్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.