Ponnaganti Aku Pesarapappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఇతర ఆకుకూరల వలె పొన్నగంటి కూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా పొన్నగంటి ఆకు మనకు మేలు చేస్తుంది. ఈ ఆకుతో కూడా మనం వివిధ రకాల కూరలను, వేపుళ్లను తయారు చేస్తూ ఉంటాము. పొన్నగంటి ఆకుతో మనం సులభంగా చేసుకోదగిన వంటకాల్లో పొన్నగంటి ఆకు పెసరపప్పు వేపుడు కూడా ఒకటి. పొన్నగంటి ఆకు, పెసరపప్పు కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఈ వేపుడును అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పొన్నగంటి ఆకు పెసరపప్పు వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొన్నగంటి ఆకు పెసరపప్పు వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పు – 100 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పొన్నగంటి ఆకులు – 200 గ్రా., లేదా 2 కట్టలు, పసుపు – పావు టీ స్పూన్.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర -అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10నుండి 12, ఉప్పు – తగినంత, ఎండు కొబ్బరి ముక్కలు – 2 ఇంచుల ముక్క.
పొన్నగంటి ఆకు పెసరపప్పు వేపుడు తయారీ విధానం..
ముందుగా మసాలా తయారీకి కావల్సిన పదార్థాలను జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో తగినన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. తరువాత ఈ పప్పును వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయించాలి. తరువాత పొన్నగంటి ఆకు వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఆకు దగ్గర పడే వరకు ఉడికించాలి. పొన్నగంటి ఆకు దగ్గర పడిన తరువాత ఉడికించిన పెసరపప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా, పసుపు వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొన్నగంటి ఆకు పెసరపప్పు వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే సైడ్ డిష్ గా కూడా దీనిని తినవచ్చు. ఈ వేపుడును తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.