Pop Corn Vada : మనం బియ్యం పిండితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యం పిండితో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాప్ కార్న్ వడలు కూడా ఒకటి. మనందరం ఎంతో ఇష్టంగా తినే పాప్ కార్న్, బియ్యంపిండి కలిపి చేసే ఈ వడలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పాప్ కార్న్ తో రుచికరమైన వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాప్ కార్న్ వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
పాప్ కార్న్ – 2కప్పులు, బియ్యం పిండి -ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం తురుము -ఒక టీ స్పూన్, నూనె- డీప్ ఫ్రైకు సరిపడా.
పాప్ కార్న్ వడ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పాప్ కార్న్ ను వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాప్ కార్న్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం పిండిని వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకోవాలి. తరువాత అన్ని కలిసేలా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాప్ కార్న్ వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో ఇలా తరచూ చేసే స్నాక్స్ తో పాటు ఇలా పాప్ కార్న్ వడలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.