Potato Fingers : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. బంగాళాదుంపను మనం విరివిరిగా ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. బంగాళాదుంపను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి లతోపాటు కాపర్, మెగ్నిషియం, సోడియం వంటి మినరల్స్ కూడా లభిస్తాయి. కాలేయాన్ని శుభ్రపరచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, హార్ట్ ఎటాక్ ల బారిన పడకుండా చేయడంలో బంగాళాదుంపలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా తినడానికి బంగాళాదుంపలతో ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగర్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పొటాటో ఫింగర్స్ ను ఎలా తయారుచేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), బొంబాయి రవ్వ – అర కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, నూనె – డీ ఫ్రై కి సరిపడా, ఉప్పు -తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, అల్లం పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – కొద్దిగా, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పొటాటో ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి అందులో ఒక టీ స్పూన్ నూనెను, తగినంత ఉప్పును వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బొంబాయి రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుతూ గట్టిగా అయ్యే వరకు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మరో గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను, కరివేపాకును, ధనియాల పొడిని, జీలకర్ర పొడిని, తరిగిన కొత్తిమీరను, ఉప్పును వేసి బాగా కలపాలి. తరువాత ముందుగా ఉడికించిన బొంబాయి రవ్వను కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా తీసుకుంటూ చేత్తో సన్నగా పొడుగ్గా ఫింగర్స్ లా చేసి పెట్టుకోవాలి.
తరువాత ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత ముందుగా ఫింగర్స్ లా చేసి పెట్టుకున్న వాటిని వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగర్స్ తయారవుతాయి. వీటిని నేరుగా లేదా టమాట కెచప్ తో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాలలో స్నాక్స్ తినాలనుకునే వారు ఈ విధంగా బంగాళాదుంపలతో ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగర్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.