Pudina Tomato Pachadi : టమాటాలతో మన ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలు వేసి చేసే ఏ పచ్చడైనా చాలా రుచిగా ఉంటుందని చెప్పవచ్చు. టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పుదీనా టమాట పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి లొట్టలేసుకుంటూ తినేంత రుచిగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేయవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే టమాట , పుదీనాతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా – 2 పెద్ద కట్టలు, పల్లీలు – పావు కప్పు, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5, జీలకర్ర – పావు టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 5, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 5, ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న నిమ్మకాయంత, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, పసుపు – కొద్దిగా.
పుదీనా టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి అన్నీ వేగిన తరువాత నువ్వులు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత టమాటాలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత పుదీనా, చింతపండు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పుదీనా దగ్గర పడే వరకు ఉడికించాలి. పుదీనా ఉడికిన తరువాత మూత తీసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన మసాలా దినుసులు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో ఉడికించిన పుదీనా, టమాట ముక్కల మిశ్రమం వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసి అంతా కలిసేలా మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు వివిధ రకాల అల్పాహారాలతో కూడా కలిపి తినవచ్చు.